Ktr on Modi Govt:కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన డొంక తిరుగుడు ప్రసంగం వారి వైఫల్యాలను దాచలేవని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అసత్యాలు పలికారని ఆక్షేపించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కేంద్ర మంత్రి ఎన్ని డొంక తిరుగుడు మాటలు మాట్లాడినప్పటికీ.. అసమర్ధ ఆర్థిక విధానాలతో దేశానికి కలుగుతున్న దారుణమైన ఫలితాలు, పరిణామాలను దాచలేరని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం చరిత్రలో నిలుస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడడం, 30 ఏళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్న తక్కువ స్థాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం వంటి అనేక దుష్పరిణామాలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. సాధారణ ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని.. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అసమర్ధ ఆర్థిక విధానాల ఫలితమేనని వ్యాఖ్యానించారు.
KTR on central govt: మోదీ మాటలన్నీ అసత్యాలేనని తేలిపోయింది..ప్రజాస్వామ్య సూచీ మొదలు ప్రతికా స్వేచ్ఛ వరకు, ఆర్థిక అసమానతల నుంచి అవినీతి వరకు ఏ విషయంలోనైనా గ్లోబల్ ర్యాంకుల్లో భారతదేశం నేడు తీవ్రంగా వెనకబడి ఉందంటే అది ముమ్మాటికీ మోదీ ప్రభుత్వం వల్లేనని కేటీఆర్ అన్నారు. అనాలోచిత డీమానిటైజేషన్, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ గత ఎనిమిదేళ్లుగా చతికిలపడిందన్న ఆయన.. నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్న మోదీ మాటలు అసత్యాలేనని తేలిపోయిందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 68శాతం నగదు అధికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని.. కేవలం నగదు ముద్రణకే రిజర్వ్ బ్యాంకు రూ.8వేల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. జీఎస్టీ ద్వారా దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని.. అర్థంలేని పన్ను స్లాబ్‌లతో పాటు ప్రజలకు అత్యవసరమైన వస్తువులపై సైతం భారీ పన్నులు విధించి దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. పరిశ్రమను, పారిశ్రామిక వర్గాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు.