ktr on agnipath protest: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన దేశంలో.. నల్ల చట్టాలతో రైతుల గోసపెట్టిన కేంద్రం.. ఇప్పుడు అగ్నిపథ్తో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోందన్నారు. ఆర్మీని వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ - నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా యువత ఆగ్రహానికి, ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని మరచి.. ఏకపక్షంగా, నియంతృత్వంగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.
రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశ పౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా నోట్ల రద్దు, లాక్డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సీఏఏ వంటి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేంద్రంలోని నియంతృత్వ భాజపా ప్రభుత్వం.. తాజాగా దేశ యువత ఆకాంక్షలకు భిన్నంగా అనాలోచితంగా అగ్నిపథ్ విధానాన్ని తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఆందోళన చేస్తున్న యువకులపైనే నెపాన్ని నెట్టే దుర్మార్గపు ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో చనిపోయిన యువకుడి మృతికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి కేటీఆర్ సానుభూతిని ప్రకటించారు.
75 శాతం నిరుద్యోగులుగా మారతారు: అగ్నిపథ్ పథకంపై అనేక అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక విధానాలు, పరిపాలనా నిర్ణయాల వల్ల దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఎదురుచూస్తున్న కోట్లాది మంది యువత ఆశలను వంచించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతను కూడా కాంట్రాక్ట్ విధానానికి అప్పజెప్పడం.. దేశ భద్రతపై వారి డొల్లవిధానాలకు నిదర్శనమన్నారు.
అగ్నిపథ్ ద్వారా దేశ భద్రతతో పాటు దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. నాలుగేళ్లు ఆర్మీలో విధులు నిర్వహించిన యువతలో 75 శాతం తిరిగి నిరుద్యోగులుగా మారతారన్నారు. యుక్త వయసులో ఆర్మీలో చేరిన వారిని నాలుగేళ్లకే బయటకు పంపిస్తే.. తర్వాత ఉపాధి అవకాశాలు దక్కే అవకాశాలే లేవన్నారు. సంవత్సరాల పాటు ఆర్మీలో పని చేసి బయటకు వచ్చిన మాజీ సైనికులకే సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇలాంటి సందర్భంలో సైన్యంలో చేరిన వారిలో 75 శాతం మందిని ఏటా నిరుద్యోగులుగా మార్చే ఈ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా..?: నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చిన అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కేంద్రం చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధమన్నారు. ప్రైవేటురంగంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అన్న ప్రధాని మోదీ మాటలు.. ఎంత నిజమో దేశ యువతకి తెలుసని ఎద్దేవా చేశారు. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంత యువత ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుందని, అలాంటి గ్రామీణ యువత నాలుగేళ్ల తర్వాత పోటీ అధికంగా ఉండే ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయని కేటీఆర్ అన్నారు. సంక్షోభ సమయాల్లో దేశ రక్షణకు శిక్షణ కలిగిన నూతన సైనికులతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉండాల్సిన అవసరం చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. అగ్నిపథ్తో దశాబ్దాలుగా ఆర్మీలో ఉన్న సంస్థాగత సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. భారత్కు పొరుగు దేశాలతో అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.