Ktr tweet on Google: డిజిటల్ తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం మరో ముందడుగు పడిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టెక్ దిగ్గజం గూగుల్ తన రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో కార్యాలయ ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఏర్పాటుకు ముందుకొచ్చిన గూగుల్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. అమెరికా వెలుపల గూగుల్ ఇంతపెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారని పేర్కొన్నారు. గూగుల్ నూతన కార్యాలయం దశాబ్దాల పాటు చారిత్రాత్మకంగా నిలుస్తుందంటూ కితాబులిచ్చారు.
యువత, విద్యార్థులకు, మహిళలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నానక్‌రాం గూడలో 7.3 ఎకరాల్లో నూతనంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన కార్యాలయ డిజైన్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం యువత, విద్యార్థులు, మహిళలకు ఆర్థికంగా వారికి అండగా నిలిచేందుకు అనువైన కార్యక్రమాలను నిర్వహించేందుకు గానూ గూగుల్ ప్రతినిధులతో ఎంఓయూ చేసుకున్నారు.
గూగుల్‌తో కలిసి 2017 నుంచి పనిచేస్తున్నాం. ఈ కొత్త ఒప్పందం ద్వారా యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పులు తీసుకొచ్చేలా పనిచేయబోతున్నాం. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అందిస్తున్నాం. టాస్క్ ద్వారా యువతకు డిమాండ్ ఉన్న రంగాల్లో సర్టిఫికెట్లు, స్కాలర్షిప్స్ ఇవ్వనున్నాం. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల ద్వారా మహిళలకు డిజిటల్ రంగంలో రాణించేందుకు శిక్షణ ఇవ్వబోతున్నాం. అగ్రిటెక్‌లో గూగుల్ సహకారం అందిస్తుంది. ప్రజారవాణా మెరుగయ్యేందుకు గూగుల్ మ్యాప్ సేవలను మరింత విస్తరించబోతోంది.
- కేటీఆర్, ఐటీశాఖ మంత్రి
గూగుల్ కార్యక్రమంలో కేటీఆర్