తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి వైపు ఉంటారా?.. అరాచకం వైపు ఉంటారా?: కేటీఆర్ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

కర్ఫ్యూ, మత ఘర్షణలు లేని ప్రశాంత హైదరాబాద్‌ కావాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలో తెరాసకే ఓటు వేయాలని మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య, మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన.. భాజపా నేతల మాటల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా హైదరాబాద్‌ను తెరాస సర్కారు ఎంతో అభివృద్ధి చేసిందని వివరించారు. ఎన్నికల్లో పనిమంతులకే అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

minister-ktr-election-compaign-in-ghmc
అభివృద్ధి వైపు ఉంటారా?.. అరాచకం వైపు ఉంటారా?: కేటీఆర్

By

Published : Nov 27, 2020, 9:03 PM IST

అభివృద్ధి వైపు ఉంటారా?.. అరాచకం వైపు ఉంటారా?: కేటీఆర్

రాష్ట్రప్రగతి, హైదరాబాద్ పురోభివృద్ధికి పనిచేసిన వారికి జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పట్టం కట్టాలని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. పీపుల్స్‌ ప్లాజాలో ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభకు హాజరైన కేటీఆర్​ కుల, మతాలకు అతీతంగా, సంక్షేమ, అభివృద్ది పథకాలను జోడెద్దుల్లాగా.. సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తుచేశారు. ఆర్యవైశ్యులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆయన తెరాస పాలనలో సముచితగౌరవం కల్పించామని వివరించారు. ఆర్యవైశ్యకార్పొరేషన్ ఏర్పాటును ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషిచేస్తానని కేటీఆర్​ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయం పెరగాలన్న, అభివృద్ధి పథంలో ముందుకుసాగాలన్న శాంతిభద్రతలు అదుపులో ఉండాలని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న మంత్రి... మతాలకంటే తెరాసకు జనహితమే ముఖ్యమని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో భాజపా నేతలను చెప్పమంటే.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్‌ చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. రోహింగ్యాల విషయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన ఆరోపణలను కేటీఆర్‌ ఖండించారు.

కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు..

అనంతరం సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌లో జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్‌.. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.హైదరాబాద్‌లో చిచ్చు పెట్టేందుకు విపక్షాలు స్పష్టమైన అజెండాతో ముందుకెళ్తున్నాయని, ఆ విషయంలో ప్రజలు గందరగోళానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. ఆరేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వకపోయినా ఇచ్చామంటూ భాజపా నేతలు దబాయిస్తున్నారని ఆరోపించారు.

పచ్చదనం పెంచేందుకు కృషి

హైదరాబాద్ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస సర్కారు కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగిందని వివరించారు. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ పరిధిలో 12 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. మొక్కల నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ హరిత నగరం సంకల్పాన్ని ప్రభుత్వం చూపిందని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ఇవీ చూడండి: ప్రజల్ని రెచ్చగొట్టడం సులభం.. కలపడమే కష్టం : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details