KTR Comments on BRS Office Opening in Delhi: జాతీయ రాజకీయ యవనికపై భారత రాష్ట్ర సమితి బలమైన ముద్ర వేయడం ఖాయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికి రాదని దేశ ప్రజలు గ్రహించిన నేపథ్యంలో 'గోల్డెన్ తెలంగాణ మోడల్' పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి గులాబీ సైనికుడి బాధ్యత మరింత పెరిగింది: దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం.. పార్టీ శ్రేణులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ను అజేయ శక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్న ప్రతి గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదం తొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగుతోందన్నారు. నాడు తెలంగాణ సాధన కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో.. అదే స్ఫూర్తితో దేశం కోసం కదం తొక్కాలని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పని చేద్దామంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.