KTR Comments on Central Government: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాలతో మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. మేము వస్త్ర పరిశ్రమకు సాయం చేస్తుంటే కేంద్రం దారుణంగా దెబ్బ కొడుతోందని కేటీఆర్ ఆరోపించారు. చేనేత రంగానికి సంబంధించి 8 సంక్షేమ పథకాలను రద్దు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక్క మెగా పవర్‌లూమ్ ప్రాజెక్టు కూడా కేంద్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. అపారెల్ పార్క్ జారీ చేయమంటే కేంద్రం నుంచి స్పందన కరువైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రైతుల తర్వాత నేతన్నలకే ఆధిక ప్రాధాన్యం..చేనేత రంగానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 'నేతన్నకు చేయూత' పథకం ద్వారా ఆదుకున్నామన్నారు. చేనేత లక్ష్మి పథకం ద్వారా రాయితీలు ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తర్వాత నేతన్నలకే కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న కేటీఆర్... రైతుబీమా తరహాలో నేతన్న బీమా అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులకు గుర్తింపు, గౌరవం లభించిందని పేర్కొన్నారు.