Minister KTR at Textile weavers Meeting in Nagole : గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకున్నామని బీఆర్ఎస్ పార్టీ వర్కంగ్ ప్రెసిడంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మౌలిక వసతులు బాగుపడ్డాయని పేర్కొన్నారు. ఎల్బీనగర్లోని నాగోల్లో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి కేటీ రామారావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గతంలో కరెంట్ సమస్యలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉందో ప్రజలే తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కడుపు నిండా కరెంట్ ఇస్తున్నామని.. సాగు, త్రాగు నీరు సమస్యలు తీర్చుకున్నామని మంత్రి పేర్కొన్నారు. వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నామని.. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఇవాళ ఎదిగామన్నారు. మునుగోడులో గోడు తీర్చినామని.. ప్లోరోసిస్తో అక్కడ ఎంతో మంది ఇబ్బందులు పడ్డారన్న ఆయన.. అలాంటిది ప్లోరోసిస్ను రూపుమాపేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం రూపకల్పన చేశామని చెప్పారు.
జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నర్సింగ్ కాలేజీ పెట్టిమని మంత్రి తెలిపారు. ఎక్కడి వాళ్లకు అక్కడే వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టి పేద బిడ్డలకు ఉచితంగా చదువును అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. 10 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుచేసుకోండని మంత్రి కోరారు.
KTR Participates in Handloom and Textiles Industry Weavers Meeting : 10 ఏళ్ల కింద 10 గంటలు కరెంట్ పోయిన ఆడిగేవాడు లేరని.. ఇప్పుడు 10 నిమిషాలు కరెంట్ పోతే ఇదేందీ పరిస్థితి అంటున్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు చేసినవి ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తాము చేసింది 6 సంవత్సరాల కాలం మాత్రమేనని పేర్కొన్నారు. ఆరున్నరేళ్ల పని చేసిన తమ మీద 65 ఏళ్లు పాలించిన వారు వచ్చి అడుగుతున్నారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ రంగం బాగు పడకుండలేదని.. అన్ని కులాన్ని మంచిగా చూసుకున్నామని అన్ని వర్గాలను, అన్ని రంగాలను ఆదుకున్నామని స్పష్టం చేశారు.