హైదరాబాద్ పరిధిలోని చెరువుల పరిరక్షణకు మూడు రకాల ప్రణాళికను సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, బేతి సుభాష్‌రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సమగ్ర చెరువుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టిన చర్యలను మంత్రి ప్రస్తావించారు. ఫెన్సింగ్, చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు తదితర అంశాలను వివరించారు.
''నగరం పరిధిలో 185 చెరువులు ఉండగా.. 127 అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఇప్పటికే 48 చెరువులను అభివృద్ధి చేశాము. రూ.407 కోట్ల 30 లక్షలు మంజూరు చేయగా.. రూ.218 కోట్లు ఖర్చు చేశాము. రూ.94 కోట్ల 17 లక్షల అంచనా వ్యయంతో 63 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టి వాటిలో 48 పూర్తి చేశాము. మిషన్ కాకతీయ అర్బన్ కింద రూ.282 కోట్ల 63 లక్షలతో 19 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రూ.30 కోట్ల 50 లక్షలు అంచనా వ్యయంతో వర్షాలకు దెబ్బతిన్న 45 చెరువులకు మరమ్మతులు జరుగుతున్నాయి. కబ్జాతో చెరువులు కుంచించుకుపోయాయనేది వాస్తవం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలను తొలగిస్తాం. చెరువుల పరిరక్షణకు కొత్త డివిజన్ ఏర్పాటు చేసి లేక్స్ స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తాం. ఇకమీదట చెరువుల ఆక్రమణలు జరగనివ్వబోము.''