Ktr on NDA Govt: బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం... 2022 వరకు పూర్తి చేస్తామంటూ గతంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్ చేశారు. 2022లోగా నెరవేరుస్తామన్న హామీలను గుర్తు చేస్తున్నానన్న కేటీఆర్... అందుకు సంబంధించిన వార్తలను జతపరిచారు.
2022లోగా ప్రతి కుటుంబానికి ఇళ్లు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి ఇంటికీ విద్యుత్, నీరు, శౌచాలయం, బుల్లెట్ రైల్, భారత ఎకానమీ ఐదు ట్రిలియన్లకు రెట్టింపు, తదితరాలపై ప్రధాని చేసిన ప్రకటనలు అందులో ఉన్నాయి. ఇచ్చిన హామీలు నెరవేరేలా, మీ ప్రణాళికలు సాకారమయ్యేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలాంటి అభివృద్ధి పథాన సాగుతున్న రాష్ట్రాలకు తగిన మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలని... నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నాం. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలి. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి. నీతిఆయోగ్ చెప్పినట్టు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలి.