Telangana Budget Sessions 2023-24 : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలతో, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టారు. మండలిలో బడ్జెట్‌పై చర్చ కొనసాగడంతో పాటు చర్చకు మంత్రి హరీశ్‌రావు ఇవాళ సమాధానమిస్తున్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం నేటి నుంచి మూడు రోజుల పాటు బడ్జెట్ కేటాయింపులపై చర్చ ప్రారంభంకానుంది. ప్రశ్నోత్తరాలలో భాగంగా నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ఈ విధంగా సమాధానమిచ్చారు.
KTR comments on Hyderabad Traffic : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా... రక్షణశాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించటం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఏడున్నరేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా... కేంద్రానికి మనసు రావటం లేదని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్న మంత్రి... రోడ్ల విస్తరణకు అడ్డంకిగా మారిన మతపరమైన నిర్మాణాల విషయంలోనూ చట్టం చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి కేటీఆర్... వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. రెండోదశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడుతున్నామన్న మంత్రి... త్వరలోనే వాటికి అనుమతిలిచ్చి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని తెలిపారు.
'రక్షణశాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించటం లేదు. ఏడున్నరేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవటం లేదు. రోడ్లపై ఉంటే మతపరమైన నిర్మాణాలపై చట్టం చేసే అంశాన్ని పరిశీలిస్తాం. ఎస్‌ఆర్‌డీపీ కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. మొదటి దశలో మిగిలిన 11 ప్రాజెక్టుల్ని ఈ ఏడాది పూర్తి చేస్తాం. రెండోదశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడుతున్నాం. త్వరలోనే రెండోదశ పనులకు అనుమతిలిచ్చి ముందుకెళ్తాం'- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి