Music School pre Release Event : మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మ్యూజిక్ స్కూల్ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ముందస్తు విడుదల వేడుకలకు సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. మ్యూజిక్ యూనివర్సిటీ లాంటి వ్యక్తి ఇళయరాజాతో కలిసి వేదిక పంచుకోవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు.
ఇళయరాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కోరారు. వెంటనే స్పందించిన ఇళయరాజా మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఇళయరాజా అంగీకరించడంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
"ఐఏఎస్ పాపారావుతో నాకు 16 ఏళ్ల అనుబంధం ఉంది. ప్రభుత్వం విధానాల రూపకల్పనలో పాపారావు భాగస్వామ్యం ఉంది. పాపారావు సినిమా తీశానని చెప్పగానే ఆశ్చర్యపోయా. మ్యూజిక్ యూనివర్సిటీ లాంటి వ్యక్తి ఇళయరాజా. సైన్స్, టెక్నాలజీ అనేదే చదువు కాదని చెప్పడానికి పాపారావు మ్యూజిక్ స్కూల్ సినిమా తీశారు. మా అబ్బాయి పాట పాడి వినిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం."-కేటీఆర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి
Ilayaraja at Music School pre release event : కార్యక్రమంలో మాట్లాడిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ ఎంతో చేస్తున్నారని.. మంత్రే వచ్చి ప్రజలను వరాలు కోరుకొమ్మని అడగడం ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ నేర్చుకునే ప్రాంతంలో వైలెన్స్ ఉండదని ప్రేమ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆయన అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
"తెలంగాణలో కేటీఆర్ ప్రజలకు ఎంతో చేస్తున్నారు. ప్రజలు వచ్చి రాజును ఏం కావాలో అడిగేవారు. మంత్రి గారు వచ్చి ప్రజలను అడిగితే వద్దంటారా చెప్పండి. నా పేరు ఇళయారాజానే అయినా నేను ప్రజల్లో ఒక్కడిని. తెలంగాణ మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు నేను ఒప్పుకుంటా. మ్యూజిక్ నేర్చుకున్న ప్రాంతంలో వైలెన్స్ ఉండదు. మ్యూజిక్ నేర్చుకున్న పరిసరాల్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటైతే నాలాంటి చాలా మంది తయారవుతారు. ప్రపంచ దేశాల్లో మన దేశం నుంచి వెళ్లి చాలా మంది ప్రతిభ చూపిస్తున్నారు."-ఇళయరాజా, సినీ సంగీత దర్శకుడు