KTR Angry With Bandi Sanjay TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ విషయంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధ స్వయం ప్రతిపత్తి సంస్థ అనే విషయాన్ని సంజయ్ ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు. ఈ సంస్థలో ప్రభుత్వ ప్రమేయం పరిమితంగానే ఉంటుందనే పరిజ్ఞానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేదా అని దుయ్యబట్టారు. రాజకీయంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు వాదనలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ధరణి పోర్టల్‌ను, టీఎస్పీఎస్సీ రెండింటిని ఒకదాని విధంగానే ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తే.. రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు సైతం బండి సంజయ్ ఎదుర్కొవాల్సి వస్తుందని విమర్శలు చేశారు. ఇప్పుడేదో కొత్తగా ప్రశ్నపత్రాలు లీకైనట్లు.. బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందల ప్రశ్నపత్రాలు లీకనట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. గుజరాత్లో ఈ ఎనిమిదేళ్లలో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయి.. ఈ విషయంపై బండి సంజయ్ సమాధానం చెప్పగలరా అని మరోసారి ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీ ఉదంతం బయటకు రాగానే వేగంగా ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకుందని కేటీఆర్ వివరించారు. అర్హులకు అన్యాయం జరగకూడదనే ఆలోచనతోనే గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారని చెప్పారు. టీఎస్పీఎస్సీ ఉదంతాన్ని శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ పేపర్ లీకేజీ మొత్తానికి బీజేపీ కార్యకర్తలనే సిట్ విచారణలో తేలిందని ప్రకటించారు.