KTR Foreign Tour: తెలంగాణ రాష్ట్రంలోని అత్యుతమ విధానాలు, అవకాశాలను వివరిస్తూ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం పదిరోజుల విదేశీ పర్యటన సాగనుంది. ప్రపంచ వేదికపై తెలంగాణను మరోమారు ఆవిష్కరించనున్నారు. లండన్, దావోస్ పర్యటనకు కేటీఆర్ నేతృత్వంలోని బృందం బయల్దేరి వెళ్లింది. అధికారిక పర్యటనలో పలువురు ప్రఖ్యాత కంపెనీల అధిపతులతో సమావేశం కావడంతో పాటు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. నేటి నుంచి యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగనున్న వివిధ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. పలు ప్రముఖ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల అధిపతులతో మంత్రి సమావేశమవుతారు. ప్రపంచ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానం లక్ష్యంతో ఇక్కడి విధానాలు, పరిస్థితులను వారికి వివరిస్తారు.
లండన్ పర్యటన అనంతరం ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ముఖ్యనేతలు, పరిశ్రమల అధిపతులు హాజరయ్యే వార్షికసదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. కొవిడ్ అనంతర పరిణామాల్లో జరుగుతున్న పెద్ద సమావేశంలో ఆరోగ్యం, విద్యుత్, సుస్థిరత తదితర అంశాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన, సాంకేతికతల వినియోగంపై చర్చిస్తారు. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించనున్న వివిధ ప్యానెల్ చర్చల్లో పాల్గొననున్న కేటీఆర్... రాష్ట్రంలోని అత్యుత్తమ విధానాలు, అనుకూల పరిస్థితులను వివరిస్తారు.