Minister Koppula Eshwar Review on Ramadan: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌కు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవనంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డిలతో కలిసి కొప్పుల ఈశ్వర్ వివిధ శాఖల అధికారులతో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఈ ఏడాది కూడా రంజాన్‌కు అన్ని ఏర్పాట్లు : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగల నిర్వహణకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని కొప్పుల చెప్పారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రంజాన్‌కు ముస్లిం సోదరులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా రంజాన్‌కు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మసీదుల వద్ద రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత, లైటింగ్ వంటి అవసరమైన అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.