విద్యాసంస్థలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో మైనార్టీ, ఎస్సీ గురుకులాల్లోని(Gurukula schools) విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అధికారులకు సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గురుకులాలు దేశంలో ప్రఖ్యాతి గాంచాయని మంత్రి అన్నారు. వాటి పేరు, ప్రతిష్ఠలు మరింత ఇనుమడించేలా.. పిల్లలకు బంగారు భవిష్యత్ ఉండేలా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.
పరిశుభ్రత ముఖ్యం..
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులతో అన్నారు. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది అందరికీ టీకాలు వేయించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాలయాల పరిసరాలు, తరగతి, హాస్టల్ గదులు, కిచెన్, బాత్రూంలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. అవసరమైన మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తరగతి, హాస్టల్ గదుల్లో గాలి, వెలుతురు చక్కగా వచ్చేలా చూడాలని చెప్పారు.