Koppula Eshwar Comments on Dalitha bandhu: దేశవ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే తన మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని సవాల్ విసిరారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరగడమే కాక సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
భాజపాకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ప్రేమ ఉండదని కొప్పుల వ్యాఖ్యానించారు. దళితబంధు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి.. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతామని తెలిపారు. భాజపా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే తెలంగాణ విలీన దినోత్సవాన్ని వాడుకోవాలని చూసిందని కొప్పుల విమర్శించారు.
దళితబంధుపై దుష్ప్రచారం చేయడం సరికాదు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే తన మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలి. దేశవ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలి. భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి. భాజపాకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ప్రేమ ఉండదు. దళితబంధు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతాం. - కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖ మంత్రి