Minister Kodali Nani on Gudivada Casino Issue: గుడివాడలో తాను క్యాసినో ఆడించినట్లుగా రుజువు చేస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. క్యాసినో అంటే ఏంటో లోకేశ్‌కు తెలుసని అన్నారు. తనకు చెందిన కల్యాణ మండపంలో క్యాసినో ఆడిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. వర్ల రామయ్య, బొండా ఉమా లాంటి వ్యక్తులను నిజనిర్ధరణకు పంపుతారా అని ప్రశ్నించారు. గుడివాడలో ఏదో జరుగుతోందని చెప్తే తానే నిలుపుదల చేయించానని స్పష్టం చేశారు. గుడివాడలో తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
గుడివాడలో ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే...
tdp leaders arrest in gudiwada: తెదేపా, వైకాపా కార్యకర్తల పోటాపోటీ ఆందోళనలు.. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తతకు దారితీశాయి. సంక్రాంతి సందర్భంగా.. గుడివాడలోని కే-కన్వెన్షన్‌లో మంత్రి కొడాలి క్యాసినోలు నిర్వహించారంటూ.. తెదేపా బృందం నిజనిర్ధరణకు వెళ్లగా.. వారిని వెనక్కి పంపాలంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుడివాడ తెదేపా కార్యాలయం నుంచి కే-కన్వెన్షన్‌కు బయల్దేరిన నేతలను.. నెహ్రూ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. ఆ పక్క వీధిలో వైకాపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి. ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా తెదేపా బృందాన్ని వాహనాల్లో ఎక్కించి తరలించారు. తెదేపా నాయకుల అరెస్టు తర్వాత.. వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. బొండా ఉమ కారు అద్దాన్ని పగలగొట్టారు. గుడివాడ పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాళ్లు రువ్వారు. వైకాపా శ్రేణులను పోలీసులు కనీసం నిలువరించలేదని తెదేపా నేతలు మండిపడ్డారు.