ఆటోమొబైల్ రంగంలో భవిష్యత్... విద్యుత్ వాహనాలదే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్(Minister Jagadish Reddy news) రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీ ట్రేడ్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాళ్లన్నీ కలియతిరిగి... టూవీలర్ విద్యుత్ స్కూటర్‌ను మంత్రి స్వయంగా నడిపి చూశారు. విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ.. తద్వారా కాలుష్య కోరల నుంచి పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా... ఇంధన ధరలు నుంచి ఉపశమనం పొందవచ్చని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేలా పన్ను రాయితీలు, తయారీదారులకు ప్రోత్సాహకాలు అందజేస్తోందని మంత్రి(Minister Jagadish Reddy news) తెలిపారు. విద్యుత్ వాహనాలకు అతిపెద్ద సవాల్‌గా ఉన్న ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేసేలా... రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇలాంటి ఎక్స్‌పోల ద్వారా ఈవీ వాహనాల అమ్మకాలతో పాటు.. మార్కెట్లో వస్తున్న ట్రెండ్‌పై కొనుగోలుదారులకు అవగాహన కలుగుతుందన్నారు.
ప్రపంచంలోని పెద్ద పెద్ద నగరాలు... చైనా తీసుకున్నా, బీజింగ్ తీసుకున్నా లేదా మన దేశ రాజధాని దిల్లీలో చూసినా పొగమంచు, పొగ కలిపి నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎలక్ట్రిల్ వాహనాలను వాడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం మన రాష్ట్రం నుంచి అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ... మొదటగా కొనుకున్న వాహనాలను వేటికైనా సరే టాక్స్ రద్దు చేయడం జరిగింది. దాదాపు 130 ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతులు ఇచ్చి... ప్రారంభించడం జరిగింది. వచ్చే కొద్ది రోజుల్లోనే ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇంకా 600 స్టేషన్లను తొందరలోనే ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ప్రతిఒక్కరూ ఈ విద్యుత్ ఆధారిత వాహనాలను వాడడానికి ప్రయత్నించాలి.