minister jagadish reddy fires on governor: రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా కాకుండా బీజేపీ కార్యకర్త తరహాలో పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక పద్దతిలో ఎన్నికయిన ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అడ్డుకునే అధికారం అమెకి ఎక్కడిదంటూ ఆయన ఘాటుగా స్పందించారు. రాజ్యాంగ మూల సూత్రాలను కాదని చట్టాలు రూపొందిస్తే అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టు ధర్మసనానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు నిండు సభలో శాసనసభ్యుల ఆమోదంతో రూపొందించిన చట్టాలను నిలువరించే హక్కు గవర్నర్‌కు ఎక్కడిదని ఆయన నిలదీశారు.
ప్రపంచానికి స్ఫూర్తిదాయకం:యావత్ ప్రపంచానికి భారత పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం స్ఫూర్తిదాయకంగా నిలిస్తే మోదీ సర్కార్ దాన్ని తూట్లు పొడుస్తుందంటూ ఆయన మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు అని ఆయన పేర్కొన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో ఇది భాగమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్‌లో పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర శాసనసభలో ఒకలా.. రాజ్ భవన్లో మరోలా ప్రవర్తించడం గవర్నర్ తమిళిసైకే చెల్లిందన్నారు. నిన్న గాక మొన్న నిండు సభలో తెలంగాణా అభివృద్ధిని స్వయంగా కొనియాడిన గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌కు వెళ్లగానే అదే సభలో ఆమోదించిన పద్దులను పెండింగ్‌లో పెట్టడమే ఇందుకు తార్కాణమన్నారు.
బీజేపీకి నష్టమే: బీజేపేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలలో గవర్నర్‌ను కేంద్రం బీజేపీ కార్యకర్తలాగా వినియోగించుకుంటుందన్నారు. అది రాజకీయ పరంగా బీజేపీకి నష్టమే కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు శాసనసభ సమావేశాల్లో ఇదే అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీర్మానం చేసింది అంటే కేంద్రం వైఖరి ఏమిటో బట్టబయలు అయిందన్నారు. గవర్నర్‌ను అడ్దు పెట్టుకుని కేంద్రం ఆడుతున్న దుర్మార్గమైన నాటకానికి ఇది నిదర్శనంగా మారిందన్నారు.