National Convention on Rivers: మానవ నిర్లక్ష్యమే నదులను నాశనం చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నదులకు తిరిగి ప్రాణం పోస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లో నదుల పరిరక్షణపై జరుగుతున్న జాతీయ సదస్సులో.. రెండోరోజు మంత్రి జగదీశ్ పాల్గొన్నారు. జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన కోరారు. కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని పేర్కొన్నారు.
జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి: మంత్రి జగదీశ్ రెడ్డి ఆక్రమించినం.. అతిక్రమించనం
"మనుషుల అతిస్వార్థంతో ప్రకృతి నాశనం అవుతోంది. హైదరాబాద్‌లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. మానవులు స్వార్థంతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడే స్ఫూర్తిగా కేసీఆర్ పాలన చేస్తున్నారు. మనం నదులను ఆక్రమించినం.. అతిక్రమించినం. మూసీ, గంగను నాశనం చేసింది మనుషులే. వరదలు వస్తే ప్రకృతికి ఆక్రోశం వచ్చింది అంటున్నారు కానీ నది ఆక్రమణ చేశామని మాత్రం చెప్పలేకపోతున్నాం. 50శాతం పైగా జబ్బులకి ప్రధాన కారణం..కలుషిత నీరు, ఆహారమే." -జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
వాటి వల్లనే సాధ్యం
రాష్ట్రంలో ఆకలిని పారదోలామని మంత్రి జగదీశ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్లనే అది సాధ్యమయిందని స్పష్టం చేశారు. ఊళ్లను వదిలి నగరాలకు వలస వెళ్లినవారు తిరిగి ఊళ్లకే చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని.. వానలను వాపసు తెచ్చుకోవాలంటే పచ్చదనాన్ని పెంచాలని సీఎం చెప్పారని వెల్లడించారు. 2014కు ముందు నల్గొండ జిల్లాలో 2 లక్షల మంది ఫ్లోరోసిస్ బారినపడ్డారని... తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఆలోచనతో సమస్య తీరిందని స్పష్టం చేశారు. గతేడాది నుంచి ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని వివరించారు.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరుగుతున్న జాతీయ సదస్సులో రెండో రోజు పలు అంశాలపై చర్చిస్తున్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. నదుల పరిరక్షణ, నదుల మేనిఫెస్టో రూపకల్పన, నదుల అనుసంధానం తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి:నదుల మేనిఫెస్టో తయారీనే ప్రధాన అజెండా: వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా