రాజ్యాంగ బద్ధంగా, చట్టపరంగా నడవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా, అనాగరికంగా వ్యవహరించడం మంచిది కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేవలం సర్వే మాత్రమే చేస్తున్నామని చెప్పి.. కోర్టు ఉత్తర్వులనూ లెక్క చేయకుండా తెలంగాణను మోసం చేసి దొంగతనంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు వీడియోలు, ఫొటోలు సహా ఆధారాలు సేకరించామని.. మరోసారి ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. కేంద్ర జలవనరుల మంత్రితో సీఎం కేసీఆర్ స్వయంగా ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడి.. ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే.. తామూ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని స్పష్టం చేశారన్నారు. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వెంటనే పనులు ఆపి.. జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తీరును ఎండగడతాం..
ప్రతిపక్షాలు కలిసి వచ్చినా, రాకపోయినా.. ఏపీ సీఎం జగన్ ద్రోహాన్ని అడ్డుకొని తీరుతామని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జలాల్లో వాటాలో ఒక్క చుక్క నీటినీ ఏపీకి వెళ్లేందుకు అనుమతించమన్నారు. ప్రభుత్వ పరంగా రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు రాజ్యాంగబద్ధమైన పాత్ర పోషించాల్సిన కేంద్రం.. ప్రేక్షక పాత్ర పోషిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెరాస పక్షాన ప్రజలను ఏకం చేసి.. ఏపీని నిలవరిస్తామని.. కేంద్రం తీరును ఎండగడతామని హెచ్చరించారు.
రాజశేఖర్‌రెడ్డి నీటి దొంగ.. జగన్ గజదొంగ..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుట్రల్లో భాగస్వాములైన నేతలు.. ఆయనకు హారతి పట్టిన నాయకులు ఇవాళ ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి నీటి దొంగ అయితే... జగన్ గజదొంగ అని చెప్పాల్సిన తెలంగాణ విపక్ష నేతలు.. ప్రభుత్వంపై దాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పుడంటే వైఎస్‌కు భయపడి నోరు మెదపకపోవచ్చునన్న మంత్రి.. కనీసం ఇప్పుడైనా తెలంగాణ పక్షాన ఎందుకు నిలబడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా, కమ్యూనిస్టు పార్టీలు సహా జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు మోసం చేసినవే తప్ప.. ఏనాడూ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలేదని దుయ్యబట్టారు.