తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేట్​ సంస్థల కోసమే విద్యుత్ చట్ట సవరణ' - విద్యుత్ చట్ట సవరణ బిల్లు

‘ ప్రైవేట్‌ సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్రం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును తీసుకు వస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రాల హక్కులను హరించేందుకు కేంద్రం యత్నిస్తుందన్నారు. కేంద్ర నిర్ణయాలతో రైతులు, పేదలకిస్తున్న రాయితీలు పూర్తిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ విషయాలపై మిగతా రాష్ట్రాలతో చర్చించి... పార్లమెంట్‌లో విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతామంటున్న మంత్రి జగదీశ్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

minister jagadeesh reddy about electricity amendment bill 2020
'ప్రైవేట్​ సంస్థల కోసమే విద్యుత్ చట్ట సవరణ'

By

Published : May 11, 2020, 7:45 AM IST

ప్ర. 2020 విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్రానికి అభ్యంతరాలేమిటీ? ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది?

జ. మూడు ప్రధాన కారణాలతో బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. పేద, వెనకబడిన వర్గాలకు చేయూతనివ్వడం కోసం రాష్ట్రం అందించే రాయితీల పంపిణీపై ప్రభావం పడే అవకాశం ఉంది. రెండోది... రాష్ట్రాల హక్కులకు సంబంధించి రాష్ట్రాల పాత్రే లేకుండా పోతుంది. మూడోది.. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రగా భావిస్తున్నాం. ఈ మూడు కారణాలచేత బిల్లును వ్యతిరేకిస్తున్నాం.

ప్ర. 2003 విద్యుత్‌ చట్టానికి 2020 చట్ట సవరణ బిల్లుకు మధ్య ఉన్న తేడాలేమిటీ? రాష్ట్రానికి వచ్చే ఇబ్బందులేంటి?

జ. విద్యుత్‌ నియంత్రణ మండలిని నియమించే అధికారం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. దీని వల్ల కూడా ఇబ్బందులున్నాయి. ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రం(ఆర్‌.ఎల్‌.డి.సి.) పాత్ర పరిమితం కానుంది. జాతీయ లోడు డిస్పాచ్‌ కేంద్రం(ఎన్‌.ఎల్‌.డి.సి.) పాత్రే కీలకం కావడం వల్ల ఇబ్బందులున్నాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు మాత్రమే విద్యుత్‌ పంపిణీ చేయాలి. సవరణ బిల్లు చట్టమై అమలులోకి వస్తే... వారు ఎవరికైనా లైసెన్స్‌ ఇస్తే వారు ఎక్కడి నుంచైనా విద్యుత్‌ కొనుగోలు చేయవచ్చు. ఎవరికైనా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. దీంతో అరాచకం మొదలై ప్రభుత్వ విద్యుత్ సంస్థల ప్రాబల్యం లేకుండా పోతుంది. పంపిణీ, సరఫరాకు సంబంధించిన అనేక ఇబ్బందులు సైతం ఉన్నాయి. కేంద్రం చెప్పిన శాతం ప్రకారమే సంప్రదాయేతర ఇంధన వినియోగం జరగాలి. వాళ్లు చెప్పినట్లు వాడకపోతే జరిమానా వేస్తారు. ప్రస్తుతం 25 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. చట్టం అమల్లోకి వస్తే ఈ రైతులు మీటర్లు పెట్టుకోవాల్సి వస్తుంది.

ప్ర. రైతులు మీటర్లు పెట్టుకుంటే పారదర్శకత, జవాబుదారితనం వస్తుందని భాజపా నేతలంటున్నారు కదా ?

జ. కరెంటు ఛార్జీలను ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నిర్ణయించుకుంటున్నాం. సవరణతో కేంద్రం దానిని నిర్ణయిస్తుంది. క్రాస్‌ సబ్సిడీలిచ్చి విద్యుత్‌ సంస్థలను బతికించుకుంటున్నాం. ప్రజలకు సేవలు అందించగలుగుతున్నాం. ఉదాహరణకు పెద్ద వినియోగదారులు ఇచ్చే డబ్బులతో 69 లక్షల మంది గృహ, ఇతర చిన్న వినియోగదారులకు ఛార్జీల్లో రాయితీలిస్తున్నాం. ఈ చట్టం అమల్లోకి వస్తే అందరికీ సమానంగా ఇవ్వాలి. గృహవినియోగదారులు రాయితీ కోల్పోయే ప్రమాదముంది. 25 లక్షల పంపుసెట్లకు మీటర్లు బిగించడం పెద్ద సమస్యే. రాయితీ ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోండి. బిల్లు మాత్రం కట్టాల్సిందే అని కేంద్రం అంటోంది. రైతులు యూనిట్‌కు రూ.5 చొప్పున కట్టాలి. ఏ ప్రజలను ఏవిధంగా చూసుకోవాలో కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్రాల పాత్ర పరిమితం చేసి పూర్తిస్థాయిలో ప్రైవేట్‌ వాళ్లకు కొమ్ము కాస్తున్నారు. ఈవిధంగా రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాయాలని చూస్తోంది.

ప్ర. ఒకే దేశం ఒకే పన్ను అన్నప్పుడు జీఎస్టీని సమర్థించారు. ఇప్పుడు ఒకే దేశం ఒకే రకం విద్యుత్‌ బిల్లు అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

జ. జరిగేదాంట్లో మంచి ఉన్నప్పుడు కేసీఆర్‌ నిర్మొహమాటంగా సమర్థిస్తారు. దీనిలో రాజకీయాలు అవసరం లేదు. అందులో భాగంగానే జీఎస్టీని సమర్థించారు. ఇప్పుడు దానివల్ల కూడా కొన్ని చేదు ఫలితాలు చూస్తున్నాం. కేంద్రం ఇచ్చిన మాట తప్పుతోంది. ఇప్పటికీ ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వడంలేదు. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత వారి చేతిలోకి పెత్తనం వెళ్లిపోయింది. తర్వాత మాట మీద నిలబడరని అర్థమైంది. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు అంతకంటే దారుణంగా ఉంది. చట్టంలోనే లోపాలున్నాయి.

ప్ర. విద్యుత్‌ సవరణ బిల్లుపై మీ భవిష్యత్‌ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతోంది?

ఇప్పటికి సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తాం. త్వరలోనే దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం. మిగతా రాష్ట్రాలతో ఈ బిల్లుపై మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం. భావసారూప్యం ఉన్న రాష్ట్రాలను కలుపుకొని పార్లమెంట్‌లో తప్పకుండా బిల్లును వ్యతిరేకిస్తాం. దీనిపై కొట్లాడాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:షెడ్యూల్​ ప్రకారమే పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు!

ABOUT THE AUTHOR

...view details