కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా ఆలయాల్లో కేవలం అర్చకులతోనే పూజలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది బోనాల పండుగను ప్రజలు ఇళ్లల్లోనే జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఆలయాల్లో అర్చకులు సంబంధిత పూజలు చేస్తారని పేర్కొన్నారు. దేవాలయాల్లో పూజలు, ఇతర కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు బోనాల పండుగ జరగనుంది. జంటనగరాల్లో ప్రతిఏటా అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తారు. కొవిడ్-19 కారణంగా ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు తీయడాన్ని కేంద్రం నిషేధించింది. దీంతో భక్తులకు అనుమతి లేకుండా ఆలయాల్లో అర్చకుల ద్వారా బోనాల పండుగకు సంబంధించిన పూజలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజలందరూ వారివారి ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఎక్కువ మంది గుమికూడకుండా కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమై భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. భక్తులు, ప్రజల సౌకర్యార్థం ఆలయాల్లో అర్చకులు చేసే పూజలు, ఇతర కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేసే ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు.