హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 220 కోట్ల మొక్కలు నాటామని, అందులో 72 శాతానికిపైగా బతికాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నాలుగు శాతం మేర పచ్చదనం పెరిగిందని, పల్లెలన్నీ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏడో విడతలో భాగంగా మరో 20 కోట్ల మొక్కలు నాటనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్నెళ్లలో పోడు భూముల అంశానికి సంబంధించి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
- తెలంగాణకు హరితహారం ఆరు విడతలకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి?
అడవులు నశించిపోయి, పచ్చదనం తగ్గి వర్షాలు సకాలంలో కురవని నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 230 కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పంతో ప్రారంభించాం. ఇప్పటివరకు 220 కోట్ల మొక్కలు నాటాం. ఈ విడతలో మరో 20 కోట్ల మొక్కలు నాటుతాం. ప్రతి గ్రామం, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రం పచ్చదనంతో శోభిల్లుతోంది.
- ఈ కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణ చర్యలు, ఫలితాలు ఎలా ఉన్నాయి?
మొత్తం 220 కోట్ల 70 లక్షలు మొక్కలు నాటాం. వాటిలో 72 శాతం బతికాయి. ఈ విడతలో 20 కోట్ల 91 లక్షలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటివరకు దీని కోసం రూ.5 వేల 591కోట్ల నిధులు ఖర్చు చేశాం. ఇదే విధంగా మరో నాలుగేళ్లు కృషి చేస్తే 33 శాతం అడవిని సాధిస్తాం. 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి చేస్తున్నాం.
- అడవుల పునరుద్ధరణకు చేపట్టిన చర్యలేంటి?
అటవీ శాఖలో పెద్ద ఎత్తున నర్సరీలు అభివృద్ధి చేశాం. అడవులు నశించిన చోట మళ్లీ చెట్లను పెంచుతున్నారు. అడవుల్లో పునరుజ్జీవన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాం. అడవిలో ఖాళీగా ఉన్న స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని సీఎం చెప్పారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
- అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి?