Minister Harishrao at Every Sunday Ten O Clock Ten Minutes : అసలే వర్షాకాలం.. అంటు రోగాలు ప్రబలే సమయం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. వ్యాధులు రాకుండా చూసుకోవటం అవసరమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు దోమల నివారణ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కోకాపేట్‌లోని తన నివాసంలో 10 నిముషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం.. ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా తమ ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు.
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించండి :ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా తమ ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.పూల కుండీలు, కొబ్బరి చిప్పలు వంటి వాటిల్లో నిలువ ఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు, కార్యాలయాలు, పరిశ్రమల్లో.. మూతలు లేని ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, కూలర్లు వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలన్నారు. దోమల వ్యాప్తి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని.. దోమల రహిత రాష్ట్రం కోసం ప్రజలందరూ కలిసి పోరాడాలని సూచించారు.