Harishrao Foundation Stone for Erramanzil Hospital: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో 200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. నిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను 54కోట్ల రూపాయల ఖర్చుతో 4 అంతస్తుల్లో నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. గాంధీ, మల్కాజ్‌గిరిలో కూడా ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు.
ఎంసీహెచ్‌ల మీద రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నాం: మాతా, శిశు మరణాల తగ్గింపులో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం 3వ స్థానం నుంచి మొదటి స్థానం కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఎంసీహెచ్‌ల మీద రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. గర్భిణీలు వివిధ సమస్యలతో బాధపడతారని అటువంటి వారిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తే, మార్గమధ్యలో మరణించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చెంతకు ఎంసీహెచ్ తెస్తున్నామన్నారు. గాంధీ, అల్వాల్, నిమ్స్‌లో మొత్తం 600 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని హరీశ్‌రావు వెల్లడించారు. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
'నిమ్స్‌కు అనుబంధంగా మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం రూ.54 కోట్లతో అధునాతన ఆసుపత్రి నిర్మిస్తున్నాం. మాతా, శిశుసంరక్షణ ఆస్పత్రులను 3నుంచి 27కు పెంచుతున్నాం. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గాయి. శిశు మరణాలు 21కి తగ్గించుకుని దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. నిమ్స్‌ను అదనంగా 2 వేల పడకలు విస్తరిస్తాం. నిమ్స్‌లో 100 పడకల డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తున్నాం.'-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
నిమ్స్‌లో 100 పడకల డయాలసిస్ యూనిట్:మరోవైపు అధునాతన సౌకర్యాలతో నిమ్స్‌ను మరో 2 వేల పడకల సామర్థ్యంతో విస్తరిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్‌కి ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్నారు. దేశంలోనే మొట్టమొదటగా నిమ్స్‌లో 100 పడకల డయాలసిస్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు నిమ్స్‌లో డయాలసిస్ పడకలు 34 వరకు ఉంటే వాటిని 100కు పెంచుకుంటున్నామన్నారు. దీంతో రోజుకు 1500మంది పేషెంట్లకు సేవలు అందుతాయన్నారు. 2,000 పడకల నిమ్స్ కొత్త బిల్డింగ్‌కు సీఎం కేసీఆర్ త్వరలో భూమిపూజ చేస్తారని తెలిపారు. అనంతరం నిమ్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిమ్స్‌లో 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలను అందజేశారు.
శిశు మరణాలు 21కి తగ్గించుకుని దేశంలో మూడో స్థానంలో ఉన్నాం: హరీశ్‌రావు ఇవీ చదవండి: