Harishrao Fires on Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ శంకుస్థాపనకు, వందేభారత్ రైళ్ల ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా అని ప్రశ్నించారు. గవర్నర్‌గా, మహిళగా తమిళిసైపై గౌరవం ఉందని.. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో కేసువేసే దాకా బిల్లులపై గవర్నర్ స్పందించలేదని.. చివరకు కొన్నింటికి కొర్రీలు పెట్టారన్నారు. ముఖ్యమైన బిల్లులు ఆపడం ప్రజలకు విద్య, వైద్యం దూరం చేయడమేనని హరీశ్‌రావు ఆరోపించారు. పిల్లలకు విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను గవర్నర్ దూరం చేస్తున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం కార్యాలయంలో హరీశ్‌రావు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఎమ్మెల్యే పొదెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపడం అన్యాయం కాదా అన్నారు. వైద్య శాఖలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచడానికి సంబంధించిన బిల్లులో రాజ్యంగపరంగా అభ్యంతరాలు ఏమున్నాయని ఆపారని ప్రశ్నించారు. పదవీ విరమణ వయసు 70 ఏళ్లకు పెంచవచ్చునని జాతీయ వైద్య మండలి నిబంధనల్లోనే ఉందని.. అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏళ్లకు పదవీ విరమణ పెంచారన్నారు.
ప్రజలకు నష్టమే..: వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్‌కు ఎందుకని హరీశ్‌రావు అన్నారు. వైద్య, విద్య ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు బిల్లును ఏడు నెలలు ఆపడం ప్రజలకు నష్టం కలిగించడం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బెంగాల్‌లో 70 ఏళ్లు ఉన్నప్పుడు.. ఇక్కడ 65కూ గవర్నర్ ఒప్పుకోరా అన్నారు. వైద్యురాలు అయి ఉండి.. ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పంచాయతీ స్థానిక సంస్థల్లో అవిశ్వాసానికి నాలుగేళ్ల కనిష్ఠ పరిమితిని పెంచితే గవర్నర్‌కు ఇబ్బంది ఏమిటన్నారు.