తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao: 'మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు' - Harishrao Letter to union defence minister

Harishrao Letter to Rajnath Singh: రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్‌ చేశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఈ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా మేక్‌ ఇన్ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Harishrao Letter to Rajnath Singh
Harishrao Letter to Rajnath Singh

By

Published : Apr 22, 2023, 12:34 PM IST

Harishrao Letter to Rajnath Singh: దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ హరీశ్‌రావు రాశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని.. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోయి మేక్‌ ఇన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

25 వేల మంది భవిష్యత్తు అంధకారంలోకి..: మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేదని.. దాదాపు రూ.930 కోట్ల విలువైన ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదని అన్నారు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని "సిక్ ఇండస్ట్రీ" గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5,000 మంది ఉపాధి దెబ్బ తింటుందని.. మొత్తంగా సుమారు 25 వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని హరీశ్ రావు లేఖలో తెలిపారు.

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి..: ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కోరుతూ "ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య" ప్రతినిధులు చేసిన వినతిలోని డిమాండ్లను మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్ఠం చేయాలని కోరారు. యంత్రాలను ఆధునీకరించడంతో పాటు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని.. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలని ఐకాస ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలని, ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details