హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగంలో 6వేల పడకలతో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. నిమ్స్ ఆస్పత్రిలో 5 కోట్లతో పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌తో పాటు 200 పడకల ఐసీయూ, వెంటిలేటర్లను, ఇతర సౌకర్యాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మరో మంత్రి గంగుల కమలాకర్, ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సీఎండీ వెంకట్ జాస్తి పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, సువెన్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా ఆస్పత్రిలో 5 కోట్ల రూపాయలతో అత్యాధునిక పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్‌ను ఏర్పాటు చేశాయి.
హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయానికి అనువైన క్లాస్-1 ఎయిర్ కండీషన్డ్ ఐసోలేషన్ క్లీన్ రూం, హార్ట్ లంగ్ మిషన్, నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా యంత్రం, బ్రాంకోస్కోప్, ఫొటోథెరపీ యూనిట్ వంటివి ఇందులో ఉన్నాయి. పుట్టుకతో గుండె జబ్బులు ఉన్న పిల్లలకు, ఇతర పేద రోగులకు ఈ యూనిట్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు అభిప్రాయపడ్డారు.