Minister Harish Rao: ఆరోగ్య శ్రీ సేవలను పీహెచ్సీ స్థాయికి విస్తరించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. పీహెచ్‌సీల పనితీరుపై అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలీకాన్ఫరెన్స్‌లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి.శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఇ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన మంత్రి.. పీహెచ్‌సీల పరిధిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న వైద్య సేవలు, గర్బిణులకు వైద్య సేవలు, వ్యాక్సినేషన్, ఎన్‌సీడీ స్క్రీనింగ్, మందులు, పరీక్షలు తదితర అంశాలపై సమీక్షించారు.
పీహెచ్‌సీలు నమోదు చేసుకోవాలి.. ఆరోగ్య శ్రీ సేవలను పీహెచ్సీ లకు వర్తింపజేయాలని నిర్ణయించినట్టు తెలిపిన మంత్రి.. ఇందుకోసం పీహెచ్‌సీలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఏఎన్‌సీ టెస్టుల ద్వారా మాతా, శిశు మరణాలు తగ్గించడం సాధ్యమవుతుందన్న ఆయన.. వైద్యులు మారుమూల ప్రాంతాల్లో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారనే కారణంతో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలలో 30 శాతం ఇన్ సర్వీస్ కోటాను ప్రభుత్వం కల్పించిందన్నారు. పీహెచ్‌సీల్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని రోగులకు బయట నుంచి మందులు తెచ్చుకోవాలని సూచిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్ని వేళల్లో అందించాలని సూచించారు.