రైతులకు మేలు చేకూరాలన్నదే తెరాస ప్రభుత్వ ధ్యేయమని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చౌడారంలో రూ.3.53 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులకు జడ్పీ ఛైర్పర్సన్ రోజతో కలసి మంత్రి శంకుస్థాపన చేశారు.
Harishrao: 'ముందు తరాలు బాగుండాలంటే రైతులు సహకరించాలి' - chowdaram bridge works
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చౌడారంలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ముందు తరాలు బాగుండాలంటే.. ప్రతీ గ్రామంలో కాల్వలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సహకరించాలని మంత్రి కోరారు.
చౌడారం గ్రామానికి డబుల్ లేన్ బ్రిడ్జి తేవడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అని... గ్రామాన్ని దశల వారీగా మరింత అభివృద్ధి చేద్దామన్నారు. ఈ వానాకాలం కింద 60 లక్షల 57 వేల 197 మంది రైతులకు రూ. 7178 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. గతంలో అన్నదాతకు రుణాలు కావాలంటే.. నానా తంటాలు పడేవాడని గుర్తుచేశారు. రైతు ఎక్కడికీ తిరగకుండా పెట్టుబడి సాయం ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. కరోనా వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినా... రైతుబంధు మాత్రం కచ్చితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. నిరంతర నాణ్యమైన విద్యుత్ కోసం ప్రభుత్వం.. నెలకు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తోందని పేర్కొన్నారు.
"7 ఏళ్ల కింద 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే.. ఈ ఏడు 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇదంతా కాళేశ్వరం జలాలతోనే సాధ్యమైంది. రాత్రనకా పగలనకా.. కష్టపడి కాలువల ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చాం. 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్నాం. ఫలితంగా భూమికి బరువయ్యే పంట పండింది. ఇక నుంచి వరినే నమ్ముకోకుండా.. వాణిజ్య పంటలకు రైతులు ప్రాధాన్యమివ్వాలి. ఆయిల్ పామ్, మల్బరీ తోటలు-పట్టు సాగు, వరి వేద సాగు విరివిగా చేపట్టాలి. పామాయిల్ పంట వల్ల రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చు. సబ్సిడీల రూపంలో.. రూపాయిలో 90 పైసల వరకు ప్రభుత్వమే సాయం చేస్తుంది. మిగతా పది పైసలు పెట్టి సాగు చేస్తే.. కాసుల పంట పడుతుంది. ముందు తరాలు బాగుండాలంటే.. ప్రతీ గ్రామంలో కాల్వలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సహకరించాలి."-హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి