తెలంగాణ

telangana

ETV Bharat / state

Bile Health Mobile APP: అరచేతిలో ఆరోగ్య సమాచారం.. రోగి వ్యక్తిగత వైద్య వివరాలు భద్రం - తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌

Bile Health Mobile APP: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునే విధంగా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ వ్యక్తిగత ఆరోగ్య రిపోర్ట్‌ యాప్‌ను ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో పాటు టి-డయోగ్నోస్టిక్స్‌ మినీ హబ్‌ను హైదరాబాద్‌లోని నార్సింగిలో జరిగిన ఓ కార్యక్రమంలో హరీశ్‌రావు ప్రారంభించారు.

Bile Health Mobile APP
డయాగ్నొస్టిక్స్‌ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి

By

Published : May 12, 2022, 6:33 AM IST

Bile Health Mobile APP: తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ అమలులో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునే విధంగా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ వ్యక్తిగత ఆరోగ్య రిపోర్ట్‌ యాప్‌ను ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో పాటు టి-డయోగ్నోస్టిక్స్‌ మినీ హబ్‌ను బుధవారం హైదరాబాద్‌లోని నార్సింగిలో జరిగిన ఓ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. యాప్‌ ద్వారా మరింత విస్తృతంగా సేవలు పొందడమే కాకుండా రోగి వ్యక్తిగత వైద్య వివరాలు భద్రంగా ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 13 వేల నియామకాల కోసం త్వరలో నోటిఫికేషన్‌ రానుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో మందులన్నీ ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు దుకాణాలకు మందుల చీటీలు రాసే వైద్యులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ, మోకీలు మార్పిడుల వంటి ఖరీదైన ఆపరేషన్లను కూడా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయనున్నామన్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా 12 చోట్ల టి-డయోగ్నొస్టిక్స్‌ మినీ హబ్‌లను ప్రారంభించారు.

యాప్‌తో ప్రయోజనాలు
* రోగి వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* రోగి ఫొటో, మొబైల్‌ నంబరు, చిరునామా తదితర సమాచారాన్ని పొందుపరచడం ద్వారా యాప్‌లోకి ప్రవేశించవచ్చు (లాగిన్‌).
* ఇందులో వైద్యఆరోగ్య శాఖ ఇతర వెబ్‌సైట్‌ల లింక్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
* దీని ద్వారా వ్యక్తిగత ఆరోగ్య వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
* రోగి రక్త, మూత్ర నమూనాలు, ఇతర నిర్ధారణ పరీక్షల వివరాలను పొందుపర్చగానే.. ఒక ఏకీకృత గుర్తింపు నంబరు వస్తుంది. ఆ వివరాలను యాప్‌లో పొందుపర్చడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల వివరాలు, నివేదికలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాత ఆరోగ్య సమాచారం, నిర్ధారణ పరీక్షల వివరాలు ఉంటే కూడా వాటిని పరిశీలించడానికి, డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
* రోగి నివాస ప్రదేశానికి సమీపంలో ఉన్న బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆసుపత్రి చిరునామా, సిబ్బంది ఫోన్‌ నంబరు తదితర వివరాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో ఆ చిరునామాకు నేరుగా వెళ్లడానికి వీలుంటుంది.
* ఆయా ఆసుపత్రుల్లో ఏయే రకాల నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
* కొన్నిచోట్ల ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్‌, మమ్మోగ్రామ్‌ వంటివి మాత్రమే లభిస్తాయి. అందుకే తమకు ఎటువంటి పరీక్షలు అవసరమనేది యాప్‌లో చూసుకొని, ఆ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
* నిర్ధారణ పరీక్షలు ఏ దశలో ఉన్నాయో తెలుస్తుంది.
* వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సేవలపై తమ అభిప్రాయాలను నమోదు చేయడానికి అవకాశం ఉంది.
* వైద్యసేవలపై కలిగిన అసౌకర్యం గురించి కూడా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ABOUT THE AUTHOR

...view details