Harish Rao Launched TIFA Scanning Missions: రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 43 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, రూ.20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.. 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్‌లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్ పేట్ల బురుజు ఆసుపత్రి వేదికగా మంత్రి హరీశ్‌రావు వర్చువల్ విధానంలో టిఫా స్కానింగ్ యంత్రాలను ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సగటున 100 మంది శిశువుల్లో 7శాతం శిశువులకు లోపాలు ఉంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని ఈ లోపాలను టిఫా స్కానింగ్‌తో గుర్తించడం సాధ్యమవుతుందుని చెప్పారు. గతంలోనూ పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్ కిట్ పథకాన్ని.. సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 99.2 శాతం ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు జరిగాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.