Harish Rao at Vaccination for 12-14 years Children: కొత్త వ్యాక్సిన్ కావాలంటే ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి వచ్చిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దేశంలో కొవిడ్‌కు మూడు టీకాలు వస్తే అందులో రెండు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లో తయారైనవే అని పేర్కొన్నారు. కొవాగ్జిన్, కొర్బెవాక్స్ వ్యాక్సిన్లు... భాగ్యనగరం నుంచే రావడం గర్వకారణమన్నారు. ఖైరతాబాద్‌లో 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, బయోలాజికల్-ఇ ఎండీ మహిమ దాట్ల పాల్గొన్నారు.
ముప్పు పొంచి ఉంది
"కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ముప్పు పొంచి ఉంది. మూడోదశలో కరోనా ప్రభావం చూపలేదనే నిర్లక్ష్య ధోరణి వద్దు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కొత్త వ్యాక్సిన్ కోసం ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోంది. దేశంలో వచ్చిన 3 వ్యాక్సిన్లలో 2 హైదరాబాద్ నుంచే వచ్చాయి." -హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి