Harish Rao speech about medical college: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల పనులు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలపై అధికారులతో హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్ధేశంలో గత సంవత్సరం ఎనిమిది వైద్య కళాశాలను ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది తొమ్మిది కళాశాలల్లో ఎంబీబీఎస్ వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
210 అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో పోస్టింగులు:అన్ని కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలని మంత్రి చెప్పారు. ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు లేకుండా చూడాలని.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 9 వైద్య కళాశాలలు ప్రారంభ లక్ష్యంతో ఇప్పటికే 67 మందికి పదోన్నతులు ఇచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Recruitment of Assistant Professors: 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసి, పది రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కౌన్సెలింగ్ నిర్వహించి ప్రారంభించనున్న కళాశాలలో వారిని నియమించాలని చెప్పారు. వైద్య విద్యార్థులకు అవరమయ్యే హాస్టల్ వసతితో సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, పరికరాలు సిద్దం చేయాలని స్పష్టం చేశారు.