Minister Harish Rao Review: నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపటం సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకాలు, తుంటి ఎముకల మార్పిడి శస్త్రచికిత్సలను పెంచాలని మంత్రి హరీశ్ రావు వైద్యులకు స్పష్టం చేశారు. నిలోఫర్, గాంధీ ఆస్పత్రుల సూపరిండెంట్లు, అన్ని విభాగాల అధిపతులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా పనితీరును సమీక్షించిన మంత్రి... గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఆరా తీశారు.
ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన బడ్జెట్లో 1100 కోట్లు ఆస్పత్రుల నిర్వహణకు, మందుల కొనుగోళ్లకు 500 కోట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం మరో 300 కోట్లు, వైద్య పరికరాల కోసం 500 కోట్లు, సర్జికల్ అవసరాలకు 200 కోట్లు కేటాయించామన్నారు. దీంతో పాటు డైట్ ఛార్జీల కోసం 43.5 కోట్లు కేటాయించుకున్నట్టు తెలిపారు. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను నలభై నుంచి ఎనభై రూపాయలకు, టీబీ, క్యాన్సర్ రోగులకు ఇచ్చే డైట్ ఖర్చుని 112కు పెంచినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అధికారులకు పూర్తి సహకారం అందుతోందన్న ఆయన... ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.