Harish Rao Review: పది రోజుల్లో నిమ్స్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన టెండర్ పనులను పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రుల విస్తరణ:ఈ సందర్భంగా వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని హరీశ్‌రావు అధికారులకు స్ఫష్టం చేశారు. వరంగల్ హెల్త్ సిటీని దసరా నాటికి ప్రారంభించుకునేందుకు వీలుగా సిద్ధం చేయాలన్నారు. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలన్న మంత్రి.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను విస్తరించుకునేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్‌కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.