harish rao on mlc kavitha liquor scam issue: దర్యాప్తు సంస్థలు కేంద్రానికి జేబు సంస్థలయ్యాయా అనే అనుమానం వస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలనను వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రిలో మాడ్యులార్ థియేటర్లు ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపా నేతలు నిరాధార ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కవిత ఇంటిపై దాడులను ఆయన తప్పుబట్టారు.
సీబీఐ నోటీసులు వస్తాయని దిల్లీలో భాజపా ఎంపీ మాట్లాడుతున్నారని.. దర్యాప్తు సంస్థల ప్రకటనలను పార్టీ నేతలే ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు భాజపాకు జేబు సంస్థలుగా మారాయని హరీశ్‌రావు ఆరోపించారు. భాజపాను సమర్థిస్తే నీతిమంతులు.. లేదంటే అవినీతివంతులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో మతకల్లోలాలకు ఎవరు కారణమో ప్రజలకు తెలుసన్న హరీశ్‌రావు.. హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవిత నివాసంపై దాడులు చేయాల్సిన అవసరం ఏముంది. భాజపా నేతలు ఆమెపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారు. సీబీఐ నోటీసులు వస్తాయని భాజపా ఎంపీ మాట్లాడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ చేసే ప్రకటనలు భాజపా నేతలే చేస్తున్నారు. కేంద్ర సంస్థలు భాజపాకు జేబు సంస్థలుగా మారాయనిపిస్తోంది. భాజపాతో మంచిగా ఉంటే నీతి.. ప్రశ్నిస్తే అవినీతి ముద్ర వేస్తున్నారు. కర్ణాటకలో మత ఘర్షణలకు ఎవరు కారణమో అందరికీ తెలుసు. హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి కొందరు యత్నిస్తున్నారు.-హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
భాజపా నేతలపై దావా వేసిన కవిత..: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన భాజపా నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దిల్లీ భాజపా ఎంపీ పరవేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోర్టును కవిత కోరారు. వారి ఆరోపణలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని కోరారు. ఉద్దేశ పూర్వకంగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్లో కవిత పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న మంచి పేరు, ప్రతిష్టను చెడగొట్టేందుకు అక్రమ పద్ధతులను ఎంచుకున్నారన్నారు. ఇక నుంచి తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా పరవేష్ వర్మ, మంజీందర్ సిర్సాలను ఆదేశిస్తూ మధ్యంతర ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కవిత కోరారు.