Minister Harishrao On Kaleswaram Project: రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తిరిగి ప్రతిపాదనలు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందలేదని పార్లమెంట్లో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు చేసిన ప్రకటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని.. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు.. ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో బిశ్వేశ్వర్ తుడు చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని.. జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ అనుమతులు సైతం లభించాయని పేర్కొన్నారు. అనుమతులు అన్నీ వచ్చాకే జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో ప్రకటించారని గుర్తు చేశారు.