తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2021, 5:23 AM IST

ETV Bharat / state

Minister harish rao: లాక్‌డౌన్‌తో రూ.4,100 కోట్లు కోల్పోయాం

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన దృశ్యమాధ్యమంలో శనివారం జరిగిన 44వ జీఎస్టీ మండలి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా లాక్​డౌన్​ కారణంగా మే నెలలో రూ.4,100 కోట్లు కోల్పోయామన్న మంత్రి.. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెంచాలని కోరారు.

లాక్‌డౌన్‌తో రూ.4,100 కోట్లు కోల్పోయాం
లాక్‌డౌన్‌తో రూ.4,100 కోట్లు కోల్పోయాం

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ రాష్ట్రం మే నెలలో రూ.4,100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి తెలిపారు. కరోనా ఉద్ధృతి కారణంగా మరింత నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెంచాలని కోరారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన దృశ్యమాధ్యమంలో శనివారం జరిగిన 44వ జీఎస్టీ మండలి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

మూడో విడత కరోనా ఉద్ధృతి వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని హరీశ్​రావు విన్నవించారు. దేశీయంగా అవసరాలకు తగినంత టీకా ఉత్పత్తి కావడం లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునైనా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. ‘రాష్ట్రాలను ఆదుకునేందుకు గత సమావేశంలోనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపుపై ప్రస్తావించాం. ఇకనైనా పరిశీలించాలి’ అని అభ్యర్థించగా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్‌ బదులిచ్చారు.
వైద్య సామగ్రిపై పన్నులు తగ్గాలి
కరోనా చికిత్సకు అవసరమైన ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు, వెంటిలేటర్లు తదితర వైద్య సామగ్రిపై పన్నుల శాతం తగ్గాలని మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు హరీశ్‌ మద్దతు తెలిపారు. కరోనా చికిత్స ఖరీదైనదిగా మారిందని, పేదలకు ఆ భారాన్ని తగ్గించేందుకు జీఎస్టీ పన్ను శాతాలు తగ్గాల్సిందేనని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Minister harish rao: కేంద్రం కొవిడ్​ వ్యాక్సిన్​ను త్వరగా పంపిణీ చేయాలి

ABOUT THE AUTHOR

...view details