తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao: 'వెనుకబడిన 32 జిల్లాలకు ఐదేళ్లపాటు నిధులివ్వండి' - harish rao participated in gst council

ఉత్తరప్రదేశ్​లోని లఖ్‌నవూలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. 2018-19కి సంబంధించి రాష్ట్రానికి ఐజీఎస్టీ పరిహారం రూ.210 కోట్లు ఇవ్వాలని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్​కు హరీశ్‌రావు లేఖ అందజేశారు.

Harish Rao: 'వెనుకబడిన 32 జిల్లాలకు ఐదేళ్లపాటు నిధులివ్వండి'
Harish Rao: 'వెనుకబడిన 32 జిల్లాలకు ఐదేళ్లపాటు నిధులివ్వండి'

By

Published : Sep 18, 2021, 5:28 AM IST

రాష్ట్రానికి కేంద్రం అందచేయాల్సిన నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.723 కోట్లు, ఐజీఎస్టీ బకాయిలతో పాటు వెనుకబడిన జిల్లాలకు అందచేయాల్సిన గ్రాంట్‌లను ఇవ్వాలన్నారు. 2018-19కి సంబంధించి కేంద్రం వద్ద కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో ఉన్న రూ.13,944 కోట్ల ఐజీఎస్టీ నిధుల్లో తెలంగాణకు రూ.352 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.142 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. మిగిలిన రూ.210 కోట్లను విడుదల చేయాలని కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు సాధ్యమైనంత త్వరగా నిధులను అందిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం లఖ్‌నవూలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రికి హరీశ్‌రావు స్వయంగా లేఖను అందజేశారు. అదేవిధంగా పత్తిపై జీఎస్టీలో విధిస్తున్న రివర్స్‌ ఛార్జ్‌ మెకానిజం (ఆర్‌సీఎం) పన్ను పద్ధతిని రద్దు చేయాలని జీఎస్టీ మండలిని కోరారు. ఈ అంశంపై పత్తిని సాగుచేస్తున్న మహారాష్ట్ర, గుజరాత్‌లతో చర్చించి ఫిట్‌మెంట్‌ కమిటీ దృష్టి సారించేలా చేయాలని సూచించారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రాల జీఎస్టీ రాబడులను విశ్లేషిస్తూ కేంద్ర జాయింట్‌ సెక్రెటరీ (రెవెన్యూ) తెలంగాణలో జీఎస్టీ రెవెన్యూ అంతరం తక్కువగా ఉందని అభిప్రాయపడినట్లు చెప్పింది. మండలి సమావేశంలో మంత్రితో పాటు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.

హరీశ్‌ లేఖలోని మరికొన్ని వినతులు

* పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన తొమ్మిది జిల్లాల అభివృద్ధికి జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.450 కోట్లు అందాల్సి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంతవరకూ నిధులు రాలేదు. వాటిని త్వరగా విడుదల చేయాలి.

* తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో వెనుకబడిన 9 జిల్లాలు ప్రస్తుతం 32 జిల్లాలుగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆ జిల్లాలకు ఐదేళ్లపాటు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులను ఇవ్వాలి.

* 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు సిఫార్సు చేసిన ప్రత్యేక గ్రాంట్‌ రూ.723 కోట్లను ఇవ్వాలి.

ఇదీ చూడండి: 'జీఎస్టీలోకి పెట్రో ధరలు తెచ్చేందుకు ఇది సమయం కాదు'

ABOUT THE AUTHOR

...view details