Harish rao on Nims Hospital: రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడీ శస్త్రచికిత్సలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న నిమ్స్ ఆస్పత్రికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే నిమ్స్‌లో 100 కిడ్నీ మార్పిడీ శస్త్రచికిత్సలు పూర్తి కావటం గమనార్హం. 1989 నుంచి నిమ్స్‌లో కిడ్నీ మార్పిడీ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1398 కిడ్నీ మార్పిడీ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. ఇక అందులో ఈ ఏడాది మాత్రమే వంద శస్త్రచికిత్సలు చేయటం గమనార్హం. 2016 నుంచి నిమ్స్ ఆసుపత్రిలో ప్రతీ ఏడాది వందకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరగడం విశేషం. 2016లో 111, 2017లో 114 ఆపరేషన్లు, 2018 లో 111, 2019 లో 107 ఆపరేషన్లు జరిగాయి. 2020లో కరోనా కారణంగా ఈ ఆపరేషన్లు తగ్గినా, ఈ ఏడాది ఇప్పటి వరకు 100 ఆపరేషన్లు జరగడం విశేషం.
ఈ ఏడాది జరిగిన శస్త్రచికిత్సల్లో 97మందికి పూర్తి స్థాయిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే కేసీఆర్ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్న మంత్రి.... ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను సైతం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.