Harish Rao Letter to Central Minister: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ ఇస్తుండగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వారికి కేవలం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది.
ఈనెల 10 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం 18 ఏళ్లు పైబడి అర్హలైన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ... కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు మంత్రి లేఖ రాశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9,84,024 మంది బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హత కలిగి ఉన్నట్టు మంత్రి లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి మొదటి డోసును 100 శాతం, రెండో డోసును 100 శాతం, 15-17 ఏళ్ల కేటగిరీలో మొదటి డోసును 90శాతం, రెండో డోసును 73శాతం, 12-14 ఏళ్ల వయస్సు వారికి 78 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు వివరించారు.