తెలంగాణ

telangana

ETV Bharat / state

అందులో మూడో స్థానంలో ఉన్నామని.. కేంద్రమే చెప్పింది: హరీశ్​ రావు - telangana news

Harish rao at Fever Hospital: కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది చాలా కష్టపడ్డారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. థర్డ్​ వేవ్​ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వెల్లడించారు. హైదరాబాద్​లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్​కు శంకుస్థాపన చేసిన మంత్రి.. ప్రభుత్వాస్పత్రిలో చనిపోయిన పేదల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు, అంబులెన్సులను ప్రారంభించారు.

Harish rao at Fever Hospital
హరీశ్​ రావు

By

Published : Feb 12, 2022, 12:57 PM IST

Harish rao at Fever Hospital: పేదలకు వైద్యం అందించడంలో మూడో స్థానంలో ఉన్నామని కేంద్రమంత్రే చెప్పారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. హైదరాబాద్‌ నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్‌ నిర్మాణానికి హరీశ్​ రావు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలు చనిపోతే ఇంటికి పంపేందుకు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద అంబులెన్స్‌లు ఇచ్చిన సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో మార్చురీల అభివృద్ధికి రూ. 60 లక్షలు, డయాలసిస్​ విభాగానికి రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది చాలా కష్టపడ్డారన్న ఆయన.. హైదరాబాద్‌లో నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

సమర్థవంతంగా ఎదుర్కొన్నాం

"కరోనా విపత్కర సమయంలో వైద్యసిబ్బంది కృషి ఎనలేనిది. థర్డ్​ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫీవర్‌ సర్వే ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. పేదలకు వైద్యం అందించడంలో మూడో స్థానంలో ఉన్నామని కేంద్రమంత్రే చెప్పారు. ఫీవర్​ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్​ నిర్మాణానికి రూ. 11 కోట్లు కేటాయించాం. గడ్డి అన్నారంలో వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నాం. నిమ్స్‌లో మరో 1000 నుంచి 1500 పడకల కొత్త బ్లాక్‌ను ఏర్పాటు చేయనున్నాం." -హరీశ్​ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

మార్చురీల ఆధునికీకరణ

రాష్ట్రంలోని 61 మార్చురీల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీశ్ అన్నారు. రూ.9 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రిలో అత్యాధునిక మార్చురీ ఏర్పాటు చేస్తామని.. ఉస్మానియాలో పదుల సంఖ్యలో శవ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా మార్చురీల ఆధునికీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేష్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాన్వాయ్​ను అడ్డుకున్న యూత్​ కాంగ్రెస్​

అంతకుముందుగా ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్ భూమి పూజకు వస్తున్న మంత్రి హరీశ్​ రావు కాన్వాయ్​ను హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అడ్డుకుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

పేదలకు వైద్యంలో మూడో స్థానంలో ఉన్నామని.. కేంద్రమే చెప్పింది: హరీశ్​ రావు

ఇదీ చదవండి:KTR Tweet Today : 'కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ'

ABOUT THE AUTHOR

...view details