Aadhar must for Kanti Velugu: ఈ నెల 18న మధ్నాహ్నం ఒంటిగంటకు ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో ఖమ్మం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమాల్లో పాల్గొనేలా ముందస్తు కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. శుక్రవారం సాయంత్రానికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు.. కంటి పరీక్షలు నిర్వహించే మిషన్లు, కళ్లద్దాలు, మందుల పంపిణీ చేయాలని సూచించారు.
కంటి వెలుగు పరీక్షలకు ఆధార్ తప్పనిసరి అనే విషయాన్ని ముందే తెలియజేయాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. లేదంటే ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలల పాటు జరిగితే.. ఈసారి 100 రోజుల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇందుకోసం గతంలో 827 బృందాలు పని చేస్తే.. ఆ బృందాల సంఖ్యను 1,500లకు పెంచినట్లు వెల్లడించారు. ఈ బృందాలకు వసతి, ఇతర సౌకర్యాలు స్థానికంగా సమకూర్చాలన్న మంత్రి.. బృంద సభ్యుల వసతి క్యాంపునకు సమీపంలోనే ఉండేలా చూడాలని సూచించారు.
టూర్ షెడ్యూల్ ఇవ్వాలి..: ప్రాథమికంగా 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసులు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కంటి వెలుగు క్యాంపులను మండల స్థాయిలో ఎంపీడీవో, ఎమ్మార్వో, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీవో పర్యవేక్షించాల్సి ఉంటుందని, జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్స్ క్యాంపులను మానిటరింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. క్యాంపుల సందర్శన చేసేలా వీరికి టూర్ షెడ్యూల్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజు క్యాంపుల సందర్శన ఉండేలా చూడాలన్నారు.