Harishrao on Asha workers Appointment orders : తెలంగాణ రాకముందు 'నేను రాను బిడ్డా సర్కారు దవాఖానాకు అనే విధంగా ఉండేదని.. కానీ ఆ పరిస్థితి కాస్తా ఇప్పుడు నేను పోత బిడ్డా సర్కారు దవాఖానాకు' అనేంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పు వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో పని చేస్తున్న 27వేల మంది ఆశావర్కర్ల సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హరీశ్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఎంపికైన ఆశా వర్కర్ల నియామక, శిక్షణ కార్యక్రమం శిల్పకళావేదికలో జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా.. కొత్తగా ఎంపికైన 1540 మంది ఆశా కార్యకర్తలకు నియామక పత్రాలను అందించారు. ఆశా కార్యకర్తలందరూ ఒక కుటుంబమని, వారందరూ పేదలకు మంచి సంక్షేమం అందించడం, మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా విపక్షాలను మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు నూట్రిషన్ పాలిటిక్స్ చేస్తే.. ప్రతిపక్షాలు పార్టిషన్ పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు. కుల, మత బేధాలు చూపి విభజిస్తున్నారని మండిపడ్డారు. వేతనం పెంచాలని కోరిన ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌దని అని ఆరోపించారు. ప్రతిపక్షాలు నరం లేని నాలుక అన్నట్లు వ్యవహరిస్తున్నాయన్న ఆయన.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో సైతం ఆశా కార్యకర్తలకు వేతనాలు అంతంత మాత్రమేనని పేర్కొన్నారు.