Harish rao on chandrababu: చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అన్ని వర్గాలను ఆయన మోసం చేశారని విమర్శించారు. బుధవారం ఖమ్మంలో తెదేపా భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబుపై హరీశ్ విమర్శలు గుప్పించారు. శాసనసభాపక్ష కార్యాలయంలో సహచర మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
చంద్రబాబు మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారని.. తెలంగాణ ప్రజలు వాటిని నమ్మరని హరీశ్‌రావు అన్నారు. ఏపీలో అభివృద్ధి చేయలేక తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారని విమర్శించారు. తెలంగాణలో తమకు బలముందని చూపించి భాజపాతో పొత్తు కోసమే ఆయన ఈ విధంగా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఖమ్మం సభకు పక్క రాష్ట్రం నుంచి జనాలను తరలించారని హరీశ్ ఆరోపించారు. ఏపీలో భాజపాతో పొత్తు కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు.
''ఏపీని అభివృద్ధి చేయలేక..తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఏపీని అప్పుల పాలు చేసి ఇక్కడకు వచ్చారు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైంది. అన్ని వర్గాలను మోసం చేసింది. ఉద్యోగాలు అడిగిన యువతను నక్సలైట్లతో కాల్చి చంపారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నినాదం ఐటీ. వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు. భాజపాతో పొత్తుపెట్టుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు. భాజపా పొత్తుకోసమే వెంపర్లాడుతున్నారు. తెలంగాణలో ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్ విలక్షణ నేత.. ఆయన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు.''- హరీశ్‌రావు, మంత్రి