Asara Pention to Dialysis Patients in Telangana: రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్‌లు అందించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు డయాలసిస్ రోగులకు వెంగళ్‌రావునగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కింద టెలీ మానస్ సేవలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,000 మంది డయాలసిస్ బాధితులు ఉండగా.. అందులో 10 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3 ఆస్పత్రుల్లో మాత్రమే డయాలసిస్ సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 83 ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయని తెలిపారు. డయాలసిస్ బాధితులకు ఉచిత బస్‌పాస్, డయాలసిస్ సేవలు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎంఓఎస్‌డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్వేతా మహంతి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 5 వేల మంది డయాలసిస్ రోగులకు పింఛన్లు ఇవ్వనున్నాం. తెలంగాణలో 12 వేల మంది డయాలసిస్ చేయించుకుంటుంటగా.. 10 వేల మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికి 3 ఆస్పత్రుల్లోనే డయాలసిస్ సేవలు అందేవి. ప్రస్తుతం 83 ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. ఏటా 150 వరకు కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసి.. అనంతరం మందులు సైతం ఉచితంగా ఇస్తున్నాం.- హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి