Harish Rao praised performed CPR: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో ఇటివల కాలంలో మనిషి ఆరోగ్యంలో చాలా వ్యత్యాసాలు గమనిస్తున్నాం. విశ్రాంతి లేకుండా పని చేయడం.. కంటి నిండా నిద్రలేకపోవడంతోపాటు తీసుకున్న ఆహారంలో సంపూర్ణ పోషకాలు లేకపోవడంతో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు గుండెపోటుతో అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. నిండా నలభై ఏళ్లు నిండకుండనే.. పిట్టల్లా యువకులు రాలిపోతున్నారు.
అప్పటి వరకు నలుగురితో ముచ్చట్లు పెట్టుకొని సంతోషంగా గడుపుతున్న వారు సడన్‌గా ఉన్న స్థలంలోనే కుప్పకూలిపోతున్నారు. అయితే ఇలా ఆకస్మాత్తుగా కుప్పకూలుతున్న వారిలో కొంతమందికి తక్షణం సీపీఆర్ చేస్తే కొందరి ప్రాణాలు దక్కుతున్నాయి. ఇటివలే కాలంలో రాష్ట్రంలో గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలో ఉన్నవారికి సీపీఆర్ చేస్తే దక్కిన ప్రాణాలు ఎన్నో.. సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన మహానుభావులు ఎందరో.. అలాంటి వారందరిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.
అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న వారిని రియల్ హీరోలంటూ కొనియాడారు. ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే ఆటో డ్రైవర్ ప్రాణాలను 108 సిబ్బంది మహేందర్, రమేశ్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి రామన్నపేట సీఐ మోతిరాం సీపీఆర్ చేసి మానవత్వం చాటుకున్నారని మంత్రి వివరించారు.
CPR training: సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెడుతున్న వారందరూ కనిపించే దేవుళ్లని హరీశ్‌రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని వివరించారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టవచ్చునని తెలిపారు.
ఆ రియల్ హీరోలు వీరే..:సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరుపల్లి వద్ద ఆటో నడుపుతున్న రాజు అనే యువకుడికి సడన్‌గా గుండెపోటు వచ్చింది. ఆటో పక్కకు ఆపి రాజు కిందపడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఘటన స్థాలానికి వచ్చారు. డ్రైవర్‌కి గుండెపోటు వచ్చిందని గమనించారు. సిబ్బంది మహేందర్, రమేశ్ ఆయనకు సీపీఆర్ చేశారు. సృహలోకి వచ్చిన తరువాత స్థానిక గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.