Harish rao on Central Govt: కేంద్రంలోని భాజపా రాష్ట్రానికి ఏమైనా చేసిందా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి రైతులకు వ్యవసాయం భారం చేసిందని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో ఆయనతో పాటు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి మహమూద్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాలతో తరలివచ్చిన మహిళలు కోలాటం ఆడుతూ నృత్యాలు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, కళా బృందాల ప్రదర్శన ఆకట్టుకుంది.
కేంద్రం యువతను మోసం చేస్తోంది..
వ్యవసాయ పెట్టుబడులు ఇచ్చి రైతులకు ఆర్థిక భారం తగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఉందా అని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని మంత్రి మండిపడ్డారు. విభజన చట్టాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15.69 లక్షల ఉద్యోగాల భర్తీ చేయకుండా కేంద్రం యువతను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాల ఖాళీలు లెక్కించి 317 జీవో మేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రయత్నం చేస్తుంటే... న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు తీసుకురావడం ద్వారా ప్రజలను పక్కదోవపట్టిస్తూ రాజకీయ లబ్ధిపొందాలని చూస్తోందని విమర్శించారు
భాజపా కుట్ర
సమస్య తేలకుండా, ఉద్యోగాలు భర్తీ కాకుండా చేయాలనేది భాజపా కుట్ర అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దేశంలోనే అత్యధిక వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు. రైతులకు ఎకరానికి రూ.10 వేలు కేంద్రం ఇస్తుందా? అని ప్రశ్నించారు. భాజపాకు ప్రజల మీద ప్రేమకంటే రాజకీయ లబ్ధి మీద ప్రేమ ఉందని ఆరోపించారు. జై కిసాన్ నినాదాన్ని నై కిసాన్‌గా మార్చిందని మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అడుగుతున్నదెవరని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
ఒక్కటి కూడా ఇవ్వలేదు..